ⓘ కైతల్

                                     

ⓘ కైతల్

కైతల్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది కైతల్ జిల్లాకు ముఖ్యపట్టణం. నగర పాలనను పురపాలక మండలి నిర్వహిస్తుంది.

కపిస్థల్ అని పేరు నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రజల నమ్మకం. కపి, హనుమంతుడికి మరొక పేరు. దీని అర్థం హనుమంతుడి నివాసం" అని. ఈ పట్టణాన్ని ధర్మరాజు స్థాపించాడని ప్రతీతి. పట్టణంలో హనుమంతుడి తల్లి అంజనీదేవికి ఆలయం ఉంది.

కైతల్ లోని వృద్ధకేదార విద్కార్ ఆలయ ప్రసక్తి, వామన పురాణంలో ఉంది. కైతల్‌లో అనేక దేవాలయాలున్నాయి. 48 కోసుల పరిక్రమ యాత్రలో కైతల్‌ కూడా ఒక భాగం.

                                     

1. చరిత్ర

1398 లో ఢిల్లీపై దాడి చేయడానికి ముందు తైమూర్ ఇక్కడ ఆగాడు. తరువాత, ఈ నగరం ఢిల్లీ సుల్తానుల పాలనలో ముస్లిం సాంస్కృతిక కేంద్రంగా మారింది. 13 వ శతాబ్దానికి చెందిన అనేక మంది సూఫీ సాధువుల సమాధులు నగరంలో ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది భల్ఖ్ 1246 CE కు చెందిన షేక్ సలా-ఉద్-దిన్ సమాధి. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో ఈ పట్టణాన్ని పునర్నిర్మించి, ఒక కోటను నిర్మించారు. ఐన్-ఇ-అక్బరీ ప్రకారం, ఇది సిర్హింద్ సర్కార్ క్రింద ఒక పరగణా గా ఉండేది. ఇది వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చెందింది.

రజియా సుల్తానా, 1236 నుండి 1240 వరకు ఢిల్లీ సుల్తానుగా పాలించింది. 1240 అక్టోబరులో ఓటమిపాలైన తర్వాత ఆమె, మాలిక్ అల్తూనియాతో కలిసి ఢిల్లీ వదలి పారిపోయింది. వాళ్ళు మరుసటి రోజున కైతల్‌ చేరుకున్నారు. అక్కడి వారి మిగిలిన సైనికులు కూడా వాళ్ళను విడిచి పెట్టారు. 1240 నవంబరు 13 న వాళ్లను చంపేసారు. రజియా సుల్తానా సమాధి ఇప్పటికీ కైతల్‌లో ఉంది. ఈ అంశం కైతల్ వెలుపల అంతగా తెలియదు. కాని స్థానికులకు రజియా బేగం మజార్ గురించి తెలుసు.

1398 లో తైమూర్ కైతల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అతడి సైన్యం స్థానికులను దోచుకుంది, ఊచకోత కోసింది. అస్సాండ్ వెళ్లే దారిలో ఉన్న అన్ని గ్రామాలను నాశనం చేసారు. కైతల్, ఇతర నగరాల ప్రజలు చాలా మంది భయంతో ఢిల్లీకి పారిపోయారు.

1767 లో కైతల్, సింగ్ క్రోరా మిస్ల్ నాయకుడు, భాయ్ దేసు సింగ్ మ.1781 వశమైంది. అతను తన సొంత గ్రామమైన భుచో నుండి పెద్ద సిక్కు దళానికి నాయకత్వం వహించాడు. అతడి వారసులైన, కైతల్ భాయీలు, అత్యంత శక్తివంతమైన సిస్-సట్లెజ్ రాజులలో ఒకరు. కైతల్ సిక్కు నాయకులు, 1767 నుండి 1843 లో పతనమయ్యే వరకూ పరిపాలించారు. 1808 నాటికి ఇది బ్రిటిషు వారి అధీనం లోకి వచ్చింది. 1803–1805 రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం వరకు మరాఠా సామ్రాజ్యం లోని సింధియా రాజవంశం ఈ రాజ్యాన్ని పాలించింది. వీళ్ళు మరాఠాలకు కప్పం చెల్లించేవారు. ఆ తరువాత ఈ భూభాగాన్ని మరాఠాల నుండి బ్రిటిష్ వారు చేజిక్కించుకున్నారు. భాయ్ ఉదయ్ సింగ్, కైతల్ ను పరిపాలించిన చివరి రాజు. అతడు1843 మార్చి 14 న మరణించాడు. 1867 లో కైతల్ మునిసిపాలిటీగా మారింది. 1901 లో, ఈ పట్టణ జనాభా 14.408. కర్నాల్ జిల్లాలో తహసీలు గా ఉండేది. భాయీల కోట ఇప్పటికీ ఉంది. సిక్కు పాలకులకు భాయ్ అనే బిరుదు ఉండడం మామూలైంది. 1857 స్వాతంత్ర్య పోరాటంలో కైతల్ ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.

                                     

2. జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కైతల్ మొత్తం జనాభా 1.44.915, వీరిలో పురుషులు 76.794 మంది, మహిళలు6 8.121 మంది. ఆరేళ్ళ లోపు పిల్లలు 17.531. కైతల్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 100.944, ఇది జనాభాలో 69.7%. పురుషుల్లో అక్షరాస్యత 75.3% కాగా, స్త్రీలలో 63.3%గా ఉంది. ఇక్కడి షెడ్యూల్డ్ కులాల జనాభా 24.760. కైతల్ 2011 లో పట్టణంలో 28.547 గృహాలున్నాయి.

కైతల్ అధికారిక భాష హిందీ. పంజాబీ, ఇంగ్లీషు కూడా వాడుకలో ఉన్నాయి.

                                     

3. రవాణా సౌకర్యాలు

నగరంలో కైతల్ కెఎల్‌ఇ, న్యూ కైతల్ హాల్ట్ ఎన్‌కెఎల్‌ఇ అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుండి కురుక్షేత్రకు, నార్వానాకూ రైళ్ళున్నాయి. ఢిల్లీ, కురుక్షేత్రల మధ్య నడిచే రైళ్ళు కైతల్ గుండా వెళ్తాయి.

జాతీయ రహదారి 152 కైతల్‌ను రాష్ట్ర రాజధాని చండీగఢ్తో కలుపుతుంది.